నమ్మితే నట్టేట మునిగినట్టే!

- - Sakshi

● లండన్‌ ఆర్చిబిషప్‌ నుంచి అంటూ కొన్ని రోజుల క్రితం అనంతపురంలోని ఓ వ్యక్తికి ఫోన్‌ వచ్చింది. గిఫ్ట్‌లు, బహుమానాలు ఇస్తామని ఆశచూపారు. దీంతో సదరు వ్యక్తి విడతల వారీగా రూ.1.10 లక్షలు పంపారు. కొరియర్‌ నంబర్‌, ట్రాక్‌ అంతా పకడ్బందీగానే ఉంది. షిప్‌మెంట్‌ ట్రాక్‌ కూడా బాగా చేశారు. అయితే, ఆ తర్వాత ఏమీ లేదు. చివరకు డబ్బు ఎక్కడకు వెళ్లింది అని చూస్తే.. నవీ ముంబైలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చేరినట్లు తేలింది. వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి బ్యాంకు అధికారులు, పోలీసులను ఆశ్రయించి ఎట్టకేలకు సొమ్ము వెనక్కు తెచ్చుకోగలిగారు.

● ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో తక్కువ డబ్బుకే డ్రైఫ్రూట్స్‌ ఇస్తానని ఆశచూపారు. షాపు చిరునామా, విజిటింగ్‌ కార్డు అన్నీ పంపారు. ఇంకేముంది రూ.17,800 ఫోన్‌ పే చేశారు. డబ్బు పడ్డాక ఆ వ్యక్తి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌. బ్యాంకు డీటెయిల్స్‌ చూస్తే విజయవాడ యూనియన్‌ బ్యాంకుకు క్రెడిట్‌ అయిందని, అతనికి డ్రైఫూట్స్‌ షాపు లేదని తేలింది.

● మలేషియాకు తక్కువ ఖర్చుతో పంపిస్తానని ఫేస్‌బుక్‌లో ప్రచారం చేశారు. రూ.40 వేలకే ఐదురోజుల ప్యాకేజీ అనడంతో అనంతపురంలోని 14 మంది యువకులు మొత్తం డబ్బు చెల్లించారు. చివరకు అతను ఫోన్‌ తీయలేదు. ఆరా తీస్తే గతంలో ట్రావెల్స్‌ నడిపిన విజయవాడ వ్యక్తి అని తేలింది. యువకులందరూ విజయవాడలోని ట్రావెల్‌ వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేస్తే రూ.8 లక్షల్లో మూడున్నర లక్షలు ఇచ్చారు. మిగతాది తన దగ్గర లేదని మొండికేశారు. ఇంకేముంది రిక్తహస్తంతో ఇంటికొచ్చారు.

ఆగని ఆన్‌లైన్‌ మోసాలు

అమాయకులను

బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు

తక్కువ ఖర్చు అనడంతో

మాయలో పడుతున్న జనం

ఆన్‌లైన్‌ పరిచయాలతో లావాదేవీలు చేయొద్దని పోలీసుల హితవు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మన ఊరుకాదు..తెలిసిన వాడు అంతకన్నా కాదు. అయినా సరే గుడ్డిగా నమ్మి అకౌంటుకు సొమ్ము పంపడం.. మోసపోవడం.. ఇదీ తంతు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆన్‌లైన్‌ దొంగల చేతిలో రోజూ పదుల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు. ఫేస్‌బుక్‌ పరిచయం ద్వారా నమ్మడం, వేలకు వేలు పోగొట్టుకోవడం రోజూ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు, వ్యక్తుల ఫోన్‌ ఫోన్‌నెంబర్లకు ఎవరూ స్పందించొద్దు.. అలాంటి వారితో ఎలాంటి లావాదేవీలు చేయద్దు అంటూ పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా ఏదో ఒక సందర్భంలో మోసపోతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసినా పార్శిల్‌ ఇంటికొచ్చి తెరిచి మనం బుక్‌ చేసింది కరెక్టేనా అని నిర్ధారించుకునే వరకూ పైసా లావాదేవీలు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలైనా సరే సరుకు ఇంటికొచ్చాకే క్యాష్‌ ఇచ్చేట్టు పెట్టుకోవాల్సిందే. లేదంటే మోసపోవడం ఖాయమే.

ఫేస్‌బుక్‌ పరిచయంతో మోసపోయా

రంజాన్‌ మాసం వస్తోంది వ్యాపారం చేసుకుందామనుకున్నా. ఫేస్‌బుక్‌లో నరేష్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తక్కువ ధరకే డ్రైఫ్రూట్స్‌ ఇస్తానని చెప్పాడు. షాపు, డ్రైఫూట్స్‌ ఫొటోలు అన్నీ చూపించాడు. దీంతో సుమారు రూ.17 వేలకు పైగా వేశా. ఇప్పుడు ఆ వ్యక్తి పత్తాలేడు. – సొహైల్‌, ధర్మవరం

ఆన్‌లైన్‌ ప్రకటనలు నమ్మొద్దు

ఆన్‌లైన్‌ ప్రకటనలు నమొద్దని ముందునుంచీ చెబుతున్నాం. వాటి ఆధారంగా లావాదేవీలు చెయ్యరాదు. వాళ్లెక్కడో ఉండి మోసం చేస్తారు. బాధితులకు రికవరీ కూడా జాప్యం జరుగుతుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు చేయరాదు. – డా.ఫక్కీరప్ప, ఎస్పీ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top