ఇంకెంత కాలం దగా చేస్తారు?

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మంగమ్మ (చిత్రంలో) లిఖిత, హరిత, మంజుల తదితరులు - Sakshi

మాజీ మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్సీ మంగమ్మ ఫైర్‌

వాల్మీకుల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు

ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏకసభ్య కమిటీ అధ్యయనం చేస్తోంది

అనంతపురం క్రైం: ‘గత టీడీపీ ప్రభుత్వంలో వాల్మీకులను ఎదగనివ్వకుండా తొక్కిపెట్టారు. కరుడు కట్టిన ఈ నిజాన్ని దాచి వాల్మీకులను జగన్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి అవాస్తవాలతో ఇంకెంత కాలం వాల్మీకులను దగా చేస్తారు? వాస్తవాలను మాట్లాడితే అందరూ హర్షిస్తారు. అలా కాదంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది’అని మాజీ మంత్రి పరిటాల సునీతపై ఎమ్మెల్సీ మంగమ్మ మండిపడ్డారు. వాల్మీకుల సంక్షేమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. గురువారం అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు చర్యలు చేపడతామంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే వాల్మీకులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఐఏఎస్‌ విశ్రాంత అధికారి శామ్యూల్‌ ఆనంద్‌తో కూడిన ఏకసభ్య కమిటీని గుర్తు చేశారు. వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్‌ సర్కార్‌పై అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.

● ఏడీసీసీ బ్యాంక్‌ చైర్‌పర్సన్‌ మానుకింద లిఖిత మాట్లాడుతూ.. వాల్మీకుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఉనికి చాటుకునేందుకు వాల్మీకులను వాడుకోవాలనుకుంటే సహించబోమని హెచ్చరించారు. దశాబ్దాలుగా వాల్మీకులకు కలగా ఉన్న రాజ్యాధికారం సీఎం వైఎస్‌ జగనన్న పాలనలోనే నెరవేరిందన్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ వాల్మీకులకు సముచిత స్థానం దక్కిందన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఏడీసీసీ బ్యాంకే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే ఈ బ్యాంక్‌కు తొలిసారిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తన తండ్రి వీరాంజనేయులును చైర్మన్‌గా సీఎం జగనన్న నియమించారని, ఆ తర్వాత ఆ పదవిని తనకు ఇచ్చారని గుర్తు చేశారు. వాల్మీకులను ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలూ చంద్రబాబు చేపట్టలేదన్నది అందరికీ తెలిసిన రహస్యమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వాల్మీకుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయని వారు నేడు కపట ప్రేమ చూపుతూ ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితలో చేర్చే అంశాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు చట్టబద్ధత కోసం పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సమావేశంలో ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌ ఎం.మంజుల, రాష్ట్ర నాటక అకాడమి చైర్‌పర్సన్‌ హరిత, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకురాళ్లు రాధాయాదవ్‌, భారతి, శోభాబాయి, తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకులకు ఏనాడు పదవులిచ్చారు?

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వాల్మీకులను ఫ్యాక్షన్‌ రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఏనాడైనా పదవులిచ్చారా? అని మాజీ మంత్రి పరిటాల సునీతను డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు ప్రశ్నించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్యాయం చేశారంటూ పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లోనూ వాల్మీకులకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఈ వాస్తవం తెలిసి కూడా ప్రజలను పక్కదోవ పట్టించేలా మాట్లాడడం చూస్తుంటే వాల్మీకుల జీవనంపై సునీతకు ఎలాంటి అవగాహన లేదనే విషయం అర్థమవుతోందన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఓటు బ్యాంక్‌ కోసం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పూర్తీగా తొక్కిపెట్టి.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కంటి తుడుపు తీర్మానంతో కేంద్రానికి బిల్లు సమర్పించిన అంశాన్ని నేటికీ ఎవరూ మరవలేదన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ఎలాంటి స్పష్టమైన హామీనివ్వకున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి, బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top