ఎమ్మెల్యేను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు

- - Sakshi

● టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు రాప్తాడు రూరల్‌: అధికార పార్టీ ఎమ్మెల్యేను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై అనంతపురం రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలను సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ గురువారం వెల్లడించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి విరుద్ధంగా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వివిధ పోస్టులు వైరల్‌ అయ్యాయి. దీనిపై నందమూరినగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇర్ఫాన్‌బాషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో సోములదొడ్డికి చెందిన టీడీపీ కార్యకర్త చల్లా రాఘవేంద్రనాయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పార్టీలో చురుకుగా ఉన్న సోషల్‌ మీడియా కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తల పేర్లు, ఫొటోలతో ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సిద్ధం చేసిన పోస్టులు తమకు ‘టీంపోస్ట్‌’ అనే డీపీ ఉన్న మొబైల్‌ నంబరు ద్వారా అందాయని, వీటిని టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వైరల్‌ చేస్తూ వచ్చామని నిందితుడు అంగీకరించాడు. రాఘవేంద్ర నాయుడు తెలిపిన మేరకు అతనితోపాటు సిండికేట్‌నగర్‌కు చెందిన బత్తల మంజునాథ్‌, కట్టా లోకేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు వైరల్‌ చేసే వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తామని ఈ సందర్భంగా సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ హెచ్చరించారు.

చెట్టు పై నుంచి పడి

వ్యక్తి మృతి

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న శ్రీనివాసులు (50)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం మూడో రోడ్డుకు చేరుకున్న శ్రీనివాసులు అక్కడ తాళం వేసిన ఓ ఇంటి ఆవరణలో విరగ్గాసిన టెంకాయ చెట్టును చూసి, కాయలు కోసేందుకు సిద్ధమయ్యాడు. మట్టను పట్టుకుని చెట్టు ఎక్కుతుండగా అది ఊడి చేతికి వచ్చింది. దీంతో అదుపు తప్పి ఇంటి ప్రహరీపై పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను స్థానికులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం శ్రీనివాసులు మృతి చెందాడు. ఘటనపై అనంతపురం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

632 మంది విద్యార్థుల గైర్హాజరు

రాప్తాడు రూరల్‌ : ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సంస్కతం, తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలకు 632 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 99 కేంద్రాల్లో 29,788 మంది విద్యార్థులకు గాను 29,156 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 27,203 మందికి గాను 26,663 మంది హాజరు కాగా, ఒకేషన్‌ విద్యార్థులు 2,585 మందికి గాను 2,493 మంది హాజరయ్యారు. 20 చోట్ల సిట్టింగ్‌ స్క్వాడ్‌ పరీక్షల తీరును పరిశీలించింది. అలాగే రాష్ట్ర పరిశీలకులు, ఆర్‌ఐఓ, డీవీఓలు, 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 69 కేంద్రాలను పరిశీలించారు.

టెక్స్‌టైల్‌ పార్క్‌లో కొత్త

యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

జిల్లా చేనేత, జౌళి శాఖ

ఏడీ శ్రీరంగం అప్పాజి

రాయదుర్గం రూరల్‌: మండలంలోని 74 ఉడేగోళం వద్ద ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్క్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ శ్రీరంగం అప్పాజి తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో గురువారం ఆయన యూనిట్‌ ఏర్పాటు దారుల సమావేశంలో మాట్లాడారు. పార్క్‌లోని 55 ప్లాట్లను ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం అర్హులను గుర్తించి కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇందులో ఇప్పటి వరకూ కేవలం 7 యూనిట్లు మాత్రమే నెలకొల్పారన్నారు. మిగిలిన వారు ప్లాట్లలో భవనాలు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేకపోతే కనీసం వర్క్‌షెడ్లనైనా ఏర్పాటు చేసుకుని యూనిట్లు ప్రారంభించాలన్నారు. లేకపోతే అగ్రిమెంట్లను రద్దు చేసి, ఔత్సాహికులైన మరొకరికి ఆ ప్లాట్లు కేటాయిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన కూలీలు లేకపోవడం, సకాలంలో రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాపారాలు దెబ్బతినడం తదితర కారణాలతో తాము యూనిట్లు ఏర్పాటు చేయలేకపోయామని, తమకు 6 నెలల గడువిస్తే యూనిట్‌ ఏర్పాట్లు ప్రారంభిస్తామంటూ ఈ సందర్భంగా ఏడీఏకు పలువురు విన్నవించారు.

నైపుణ్యాభివృద్ధికి చర్యలు

యూనిట్‌ ఏర్పాటుదారుల విన్నపానికి స్పందించిన ఏడీఏ మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన మానవనరులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఈ నెల 24 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భరోసానిచ్చారు. ఆసక్తి ఉన్న వారిని బ్యాచ్‌కు 30 మంది చొప్పన ఎంపిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. అలాగే రుణాల మంజూరు విషయమై బ్యాంకర్లతో మాట్లాడి నిబంధనలు సరళీకృతం చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ డీఓ బసవరాజు, ఏడీఓ మురళీమోహన్‌, స్థానిక టెక్స్‌టైల్‌ పార్క్‌ మేనేజర్‌ శివారెడ్డి, యూనిట్‌ ఏర్పాటు దారులు ప్రసాద్‌, చమ్మా ఇబ్రహీం, రవికుమార్‌, ఇబ్రహీం ఖలీలుల్లా, భీమనపల్లి దివాకర్‌, రాము, కొండి ఇబ్రహీం, రాజశేఖర్‌, వెంకటేశులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top