చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
అనకాపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కోటి సంతకాల సేకరణకు వచ్చిన అనూహ్య స్పందనే దీనికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో పూర్తి అయిందని ఆయన చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డు వద్ద పార్టీ కార్యాలయంలో జిల్లాలో వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, సీనియర్ నాయకులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల్లో ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన పుస్తకాలు ఈనెల 10న జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంటాయని చెప్పారు. ఈనెల 13న జిల్లాలో అన్ని నియోజకవర్గ పుస్తకాలను వ్యాన్లలో లోడ్ చేసి, వాటితో పాటు అనకాపల్లి రింగ్‌రోడ్డు జంక్షన్ నుంచి నెహ్రూచౌక్ వరకూ పాదయాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పాదయాత్రలో విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గోనున్నట్టు తెలిపారు. నెహ్రూచౌక్ నుంచి అమరావతికి వ్యాన్లలో కోటి సంతకాల పుస్తకాలను పంపించనున్నామని చెప్పారు. ఈనెల 16న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కోటి సంతకాలను గవర్నర్‌కు అందజేస్తారన్నారు.
70 శాతం గ్రామ కమిటీలు పూర్తి
జిల్లాలో 70 శాతం గ్రామ కమిటీల నియామకం పూర్తి చేసినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ తెలిపారు. మిగిలిన 30శాతం కమిటీల నియామకాన్ని ఈనెల 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 50వేల మంది కార్యకర్తలకు గ్రామ కమిటీల్లో స్థానం కల్పించినట్టు చెప్పారు.
అనకాపల్లి రెవెన్యూ పరిధిలో ఉంచాలి
జిల్లాలో సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని అమర్‌నాథ్ తెలిపారు. యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను అనకాపల్లి రెవెన్యూ పరిధిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 8న మునగపాక మెయిన్‌రోడ్డులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పార్టీ పీఏసీసీ మెంబర్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్, పెట్ట ఉమాశంకర్ గణేష్, అన్నపురెడ్డి అదీప్‌రాజు, కంబాల జోగులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, జిల్లా పార్టీ పరిశీలకురాలు శోభా హైమావతి, పార్లమెంట్ కార్యదర్శులు చిక్కాల రామారావు, దంతులూరి దిలీప్‌కుమార్, పైలా శ్రీనివాసరావు, ఏడువాక సత్యారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి
13న అనకాపల్లిలో పాదయాత్ర
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్


