సెస్ వసూళ్లలో వెనుకబాటు.!
● లక్ష్యానికి ఆమడ దూరంలో
ఏఎంసీ వసూళ్లు
● మిగిలి ఉన్నది 3 నెలల 23 రోజులే
నర్సీపట్నం : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు సెస్ వసూళ్లలో వెనుకబడ్డాయి. లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు నెలల 23 రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎనిమిది నెలల వ్యవధిలో 44 శాతం సెస్ మాత్రమే వసూలైంది. కొన్ని మార్కెట్ కమిటీలు సెస్ వసూళ్లలో దారుణంగా వెనకబడ్డాయి. జిల్లాలో మొత్తం ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధిలో అనకాపల్లి, రాజుపేట, బలిఘట్టం, గన్నవరం, రేగుపాలెం, వెంకన్నపాలెం, పి.ఎల్.పురం, మాడుగుల ఘాట్ రోడ్డుతో మొత్తం 8 చెక్ పోస్టులున్నాయి. గతేడాది నవంబరు నాటితో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ లక్ష్యానికి మాత్రం దూరంగానే ఉన్నాయి. గత నవంబరు నాటికి రూ.3.77 కోట్లు వసూలైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం రూ.9.67 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ.4.24 కోట్లే వసూలైంది.
ముందు వరుసలో పాయకరావుపేట
సెస్ వసూళ్లలో 57 శాతంతో పాయకరావుపేట మార్కెట్ కమిటీ జిల్లాలో ముందు వరుసలో ఉంది. ఈ కమిటీ ఆదాయ లక్ష్యం రూ.1.84 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.1.05 కోట్లు వసూలైంది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాదాపు నూరు శాతం వసూ ళ్లు సాధించే అవకాశం ఉంది. చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం మరీ తీసికట్టుగా ఉంది. లక్ష్యంలో 15 శాతం వసూళ్లు కూడా రాబట్టలేదు.
ఇప్పటి వరకు మార్కెట్ కమిటీలసెస్ వసూళ్ల వివరాలు
మార్కెట్ కమిటీ లక్ష్యం వసూలు
పాయకరావుపేట రూ.1.84 కోట్లు రూ.1.05 కోట్లు
చోడవరం రూ.1.6 కోట్లు రూ.22.80 లక్షలు
అనకాపల్లి రూ.1.85 కోట్లు రూ.77.5 లక్షలు
నర్సీపట్నం రూ.2.7 కోట్లు రూ.78 లక్షలు
యలమంచిలి రూ.2.27 కోట్లు రూ.74.9 లక్షలు
మాడుగుల రూ.60 లక్షలు రూ.19 లక్షలు
స్పెషల్ డ్రైవ్ చేపడతాం..
ఈ ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం వసూళ్ల లక్ష్యం సాధనకు కృషి చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. నిఘా పటిష్ట పరుస్తాం. గత సీజన్‌లో జీడిమామిడి దిగుబడి తగ్గింది. సరుగుడు సాగు తగ్గటం వల్ల లక్ష్యాలపై ప్రభావం చూపింది. ఈ ఏడాది వరి పంట సాగు బాగుంది. దీంతో సెస్ వసూళ్లు ఆశాజనకంగా ఉంటాయి.
– ఎల్.అశోక్‌కుమార్,
జిల్లా మార్కెట్ కమిటీ ఏడీ
సెస్ వసూళ్లలో వెనుకబాటు.!


