2,625 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
యలమంచిలి రూరల్: పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఓ రైస్ మిల్లు ఎదురుగా నిల్వ చేసిన 2,625 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు నాయకుల సమాచారం మేరకు అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన 75 బస్తాల బియ్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.26 లక్షలు ఉంటుందని యలమంచిలి పౌర సరఫరాల శాఖ డీటీ ప్రసాద్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, సేకరణకు సంబంధించి ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంకు చెందిన పినపాత్రుని వెంకట సత్యనారాయణపై 6ఏ కేసు నమోదు చేసినట్టు డీటీ తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ బియ్యంబస్తాలను పరిశీలించేందుకు రైసు మిల్లు వద్దకు రావడం చర్చనీయాంశమైంది.


