
సర్కారు భూ దాహంపై అన్నదాత కన్నెర్ర
నక్కపల్లి:
కూటమి సర్కారు భూదాహంపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. కంపెనీల కోసం సాగుభూములు ఇచ్చే ప్రసక్తి లేదంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నక్కపల్లి మండలం కాగిత గ్రామం నుంచి రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షానికి చెందిన కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎం.అప్పలరాజు, సర్పంచ్ పోతంశెట్టి రాజేష్, రైతు నాయకులు దేవవరపు శివ, పోతంశెట్టి బాబ్జీ తదితరుల ఆధ్వర్యంలో జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై పాదయాత్రలు, ఆందోళనలకు చేయడానికి అనుమతి లేదంటూ ఎస్‌ఐ సన్నిబాబు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీసం రామకృష్ణకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు రైతులంతా ఆటోల్లో నక్కపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపన కోసం నక్కపల్లి మండలంలో 4,500 ఎకరాలను సేకరించింది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అందులో 2200 ఎకరాలను ఇటీవలే ప్రభుత్వం కేటాయించింది. టౌన్‌షిప్ కోసం మరిన్ని భూములు కావాలని మిట్టల్ కంపెనీ కోరడంతో ఏపీఐఐసీ నెల్లిపూడి, కాగిత, వేంపాడు, డీఎల్ పురం గ్రామాల్లో 2565 ఎకరాలు అదనంగా సేకరించేందుకు నిర్ణయించారు. ఒక్క కాగితలోనే జిరాయితీ, ప్రభుత్వ భూములు కలిపి 307 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. రైతులతో గ్రామసభలు నిర్వహించారు. అదనంగా భూములు ఇచ్చేదిలేదని రైతులు తెగేసి చెప్పారు. అయినప్పటికీ గ్రామంలో చెరువు గర్భాలు, గ్రామకంఠాలు, శ్మశానాలను గుర్తించి సుమారు 80 ఎకరాలు భూ బదలాయింపు కింద ప్రభుత్వానికి కేటాయించడానికి పంచాయతీ తీర్మానం చేయాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. శనివారం వందలాదిమంది రైతులు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్, బల్క్ డ్రగ్‌పార్క్ కోసం జాతీయ రహదారి నుంచి నిర్మిస్తున్న రోడ్డుకు కాగితలో సుమారు 40 ఎకరాల జిరాయితీ భూములు ఇచ్చామని, దీన్ని అవకాశం తీసుకుని గ్రామానికి ఆనుకుని ఉన్న సుమారు 400 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. భూములు ఇస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, ఇప్పటికే మండలంలో 4500 ఎకరాలు తీసుకున్నారని, పదేళ్లయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూములన్నింటినీ దశల వారీగా లాక్కోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వీసం రామకృష్ణ ఆరోపించారు. కంపెనీలు వస్తే వాటిలో పనిచేసేందుకు అవసరమైన విద్యార్హతలు తమ వద్ద లేవన్నారు. ఈ గ్రామంలో నివసించే వారిలో 70 శాతం మంది వ్యవసాయ రంగంపైన, కూలి పనులపైన ఆధారపడి జీవించేవారేనన్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న భూములు తీసుకుంటే ఎక్కడకెళ్లి బతకాలని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. నక్కపల్లి, పాయకరావుపేట సీఐలు కుమారస్వామి, అప్పన్న, ఎస్‌ఐ సన్నిబాబుల ఆధ్వర్యంలో సుమారు 20 మంది పోలీసులు రైతుల ర్యాలీలో బందోబస్తు నిర్వహించారు. తమ సమస్య చెప్పుకునేందుకు కూడా పోలీసులు అడ్డంకులు కల్పించడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్టీల్‌ప్లాంట్‌కు అదనపు భూసేకరణపై కాగిత రైతుల ఆగ్రహం
తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్ర
అడ్డుకున్న పోలీసులు.. ఆటోల్లో వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

సర్కారు భూ దాహంపై అన్నదాత కన్నెర్ర