
అటవీ సిబ్బందికి రక్షణ కరువు
● ఫారెస్టు భూమిలో రోడ్డు పనులనుఅడ్డుకుంటే దాడికి దిగిన నిర్మాణదారులు ● ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోని పోలీసులు ● విధి నిర్వహణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి ● అటవీ ఉద్యోగుల సంఘం డిమాండ్
నర్సీపట్నం: విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ అటవీ అధికారుల అసోసియేషన్ నర్సీపట్నం యూనిట్ సభ్యులు శనివారం డీఎఫ్‌వో శామ్యూల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న మాకవరపాలెం మండలం యరకన్నపాలెం నుంచి యలమంచిలి జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు వేస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ భూమిలో రోడ్డు వేయడానికి కుదరదని సెక్షన్ ఆఫీసర్ వివేకానంద, బీట్ ఆఫీసర్ నూకరాజు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంధ్యారాణి అడ్డుకున్నారు. కంపార్ట్‌మెంట్ నెంబరు 1158 ప్రకారం రోడ్డు వేస్తున్న భూమి అటవీ భూమి అని ఫారెస్ట్ అధికారులు నిర్మాణదారులకు స్పష్టం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా 500 మీటర్ల వరకు రోడ్డు వేయడాన్ని తమ సిబ్బంది అడ్డుకున్నారని డీఎఫ్‌వోకు వివరించారు. రోడ్డు వేసేందుకు తీసుకొచ్చిన వాహనాలను సీజ్ చేస్తే నిర్మాణదారులు దౌర్జన్యంగా విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బందిపై దాడికి పాల్పడి వాహనాలను తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మాకవరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో వివరించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి రక్షణ లేకపోతే ఉద్యోగాలు చేయటం కష్టమని సంఘం ప్రెసిడెంట్ ఎం.సింహాచలం, వైస్ ప్రెసిడెంట్ కిరణ్, జనరల్ సెక్రటరీ బాబూరావు, గోపి, సంధ్యారాణి డీఎఫ్‌వో దృష్టికి తీసుకువెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి రక్షణ లేకపోతే ఎలా అని, దాడికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే విధులను స్తంభింపజేస్తామని వినతిపత్రంలో పేర్కొన్నారు.