
కూటమి నేతలూ.. ఇవేం పనులు?
గొలుగొండ: కూటమి నేతల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటి వరకు బడి, గుడి, ప్రభుత్వ స్థలాలు ఆక్రయించిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా శ్మశానవాటికను కబ్జా చేయడం అందర్నీ నివ్వెరపాటుకు గురిచేస్తోంది. గొలుగొండ మండలం నాగాపురంలో శ్మశానవాటికను ఆక్రమించి, దీనికి బదులుగా వేరే చోట పాఠశాలకు ఎదురు గా ప్రత్యేకంగా శ్మశానవాటిక నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
నాగాపురంలో టీడీపీ నాయకుడుకు గ్రామ సరిహద్దులో సుమారుగా మూడు ఎకరాలు భూమి ఉంది. దానికి ఆనుకొని సుమారుగా ఎకరం భూమి వరకు గ్రామానికి సంబంధించి శ్మశానవాటిక స్థలం ఉంది. ఏళ్ల తరబడి ఇక్కడే దహన సంస్కారాలు చేస్తున్నారు. పదేళ్ల కిందట అంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సదరు నాయకుడు వెంటనే తన భూమిని ఆనుకుని ఉన్న శ్మశానవాటిన స్థలానికి కంచె ఏర్పాటు చేసి ఆక్రమించాడు. గ్రామస్తులు ఏకమై కంచె తొలగించి మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఆక్రమంచిన స్థలం శ్మశానవాటికగా నిర్ధారించారు.
మళ్లీ షరా మామూలు.!
ప్రస్తుతం కూటమి ప్రభత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ 2014 పరిస్థితి వచ్చింది. శ్మశానవాటిక స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమంచి కంచె వేయడంతో ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరైనా గ్రామంలో చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నాగాపురం కూటమి నాయకులు కొత్త కథ తెరపైకి తెచ్చారు. శ్మశానవాటిక నిర్మాణం కోసం సుమారుగా రూ.10 లక్షలు నిధులు మంజూరయ్యాయని గ్రామంలో ప్రచారం చేశారు. సర్పంచ్ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడంతో తీర్మానం చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఉన్న శ్మశానవాటికలో పనులు చేస్తానంటే తీర్మానం చేస్తానని సర్పంచ్ యలమంచి రఘురాం స్పష్టం చేశారు. దీంతో తీర్మానంతో పని లేకుండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న చెరువు గర్భంలో అధికారులు పనులు మొదలు పెట్టారు.
బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు
ప్రశాంత వాతావరణంలో ఉన్న పాఠశాల చెంతన శ్మశానవాటిక పనులు చేపట్టడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు పూర్వం నుంచి ఉన్న శ్మశానవాటికను విడిచిపెట్టి పాఠశాల పక్కన ఎలా ఏర్పాటు చేస్తారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. లక్షలు విలువైన శ్మశానవాటిన స్థలాన్ని టీడీపీ నాయకుడికి కట్టబెట్టడానికి పాఠశాలకు 20 మీటర్ల దూరంలో చెరువు గర్భంలో పనులు చేయడంపై మండిపడుతున్నారు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు జూన్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు కనీసం స్పందించలేదు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా శ్మశానవాటిక పనులు జరిగిపోతున్నాయి. చెరువు గర్భంలో పనులు చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకోలేదు.
పాఠశాలకు ఎదురుగా శ్మశానవాటిక పనులు జరుగుతున్న దృశ్యం
కోర్టులో తేల్చుకుంటాం..
స్థానిక టీడీపీ నాయకుడి భూమికి ఆనుకొని ఉన్న శ్మశానవాటిక స్థలం కబ్జాపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశాం. ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేశాం. శ్మశానవాటినను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉన్న చెరువు గర్భంలో కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ అధికారులు శ్మశానవాటిక పనులు చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నాం. అక్కడే తేల్చుకుంటాం.
– యలమంచిలి రఘురాం,
నాగాపురం సర్పంచ్

కూటమి నేతలూ.. ఇవేం పనులు?