
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వివిధ కళాశాలల విద్యార్థులు
నర్సీపట్నం: ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆర్డీవో వి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్, డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ మాట్లాడుతూ రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. హాస్టళ్లకు సొంత భవనాలు కల్పించాలన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ వెంటనే కల్పించాలన్నారు. శివపురంలో ఎక్కువగా హాస్టల్స్, కాలేజీలు ఉన్నందున విద్యార్థుల రక్షణ నిమిత్తం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు, నాయకులు వికాస్, సందీప్ గురూజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.