
రోడ్డు పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు
మాకవరపాలెం: ఫారెస్ట్ భూమిలో రోడ్డు వేస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ పనులకు వినియోగించిన రెండు పొక్లెయిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలోని 300 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దీంతోపాటు ఇదే రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో మరో 450 ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించనున్నట్టు ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు యరకన్నపాలెం నుంచి యలమంచిలి మండలంలో జాతీయ రహదారిని కలుపుతూ పెదపల్లికి రోడ్డును సైతం నిర్మిస్తామని ఇటీవల కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నుంచి రోడ్డు చదును పనులు చేపట్టారు. 40 అడుగులకుపైగా వెడల్పుతో అర కిలోమీటర్ పొడవునా రోడ్డు చదును పనులు పూర్తి చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఈ భూమి తమ దంటూ పనులను అడ్డుకున్నారు. పనులకు వినియోగించిన రెండు పొక్లెయిన్‌లను స్వాధీనం చేసుకున్నామని, మరో రెండు జేసీబీలను బలవంతంగా తీసుకువెళ్లిపోయారని కోటవురట్ల సెక్షన్ అధికారి వివేకానంద సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతోనే రోడ్డు పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు రోడ్డు పనులు జరగనివ్వమన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ బీట్ అధికారి నూకరాజు ఉన్నారు.
రెండు పొక్లెయిన్‌లు స్వాధీనం
పోలీసులకు ఫిర్యాదు

రోడ్డు పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు