
డంపింగ్ యార్డుతో దుర్వాసన
● విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు వీరుయాదవ్ నిరసన
అనకాపల్లి: పట్టణ నడిబొడ్డున డంపింగ్ యార్డును తక్షణమే తొలగించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న డంపింగ్ యార్డు వద్ద ప్లకార్డుతో సోమవారం ఆయన నిరసన చేపట్టారు. జీవీఎంసీ జోనల్ అధికారులు అనధికారికంగా 12 ఏళ్లుగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డు తరలించకపోగా.. చికెన్ సెంటర్ల నుంచి తీసుకొచ్చిన కోళ్ల వ్యర్థాలను ఇక్కడే వేస్తున్నారన్నారు. దీనిపై జోనల్ కమిషనర్, సిబ్బంది మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు కొనసాగించడమే చట్టవిరుద్ధమన్నారు. తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంతో ఉదయం ఐదు గంటల నుంచి ఇళ్లలోఉండలేకపోతున్నామని వాపోయారు. ఇలాగైతే వ్యాధుల బారిన పడి చనిపోయే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలని కోరారు.