
మాడుగులలో భారీ చోరీ
● ఇంట్లో బీరువా బద్దలు కొట్టి దోపిడీ ● 19.5 తులాల బంగారం, రూ.1.90 లక్షలు నగదు మాయం ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్ టీం
మాడుగుల రూరల్: మాడుగుల రాజవీధిలో కోడూరు లక్ష్మి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి దొంగలు ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో 19.5 తులాలు బంగారం, రూ. 1.90 లక్షలు అపహరించారు. సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి వున్న విషయాన్ని ఇంటి పక్కన్న వున్న వారు లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో బాధితురాలు చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ జి. నారాయణరావు, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ పైడిపునాయుడుతో పాటు క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో చిందరవందరగా వున్న వస్తువులను పరిశీలించారు. లక్ష్మి కుటుంబ సభ్యుల ను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ నెల 1వ తేదీన లక్ష్మి తన కూతురుతో కలిసి మల్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తర్వాత ఇంతవరకు ఆమె ఇంటికి రాలేదని, ఈలోగా ఆదివారం రాత్రి ఈ చోరీ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

మాడుగులలో భారీ చోరీ