
కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై దాడి గర్హనీయం
● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత
అనకాపల్లి: కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై కూటమి గుండాలు పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం అత్యంత దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్‌బుక్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రతినిధిపై టీడీపీ, జనసేన పార్టీ గుండాలు మూకుమ్మడిగా దాడి చేయడం హేయమన్నారు. రాష్ట్రంలో ఏదోఒక ప్రాంతంలో మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని విమర్శించారు. ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి లోకేష్ అనేక హామీలు ఇస్తూ, ఆడవాళ్ల జోలికి వస్తే, అదే వాళ్లకు ఆఖరి రోజని, వారి తాట తీస్తామని, అనేక కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. హోంమంత్రిగా సాక్షాత్తూ ఓ మహిళా ప్రతినిధి ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. ఇప్పటికై నా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.