
కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై పచ్చమూక దాడులు దుర్మ
● జిల్లా ప్రథమ పౌరురాలికి రక్షణ కల్పించలేకపోవడం దారుణం ● దాడులకు తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ ధ్వజం
దేవరాపల్లి : కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధిపై టీడీపీ, జనసేన గూండాలు ముకుమ్మడిగా దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కూటమి కార్యకర్తలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, ఇక సామాన్య మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో ఆగమేఘాలపై ఒక మహిళను జైల్లో పెట్టిన పోలీసులు, జెడ్పీ చైర్ పర్సన్, జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడులు చేస్తే అదే మాదిరిగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కారులో వెళ్తున్న మహిళా ప్రజాప్రతినిధిని నడిరోడ్డుపై అడ్డగించి దాడికి పాల్పడితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్, డీజీపీ తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆడపిల్లలకు సైతం రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ విద్యార్థినుల ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.