గుండె గుబిల్లు | - | Sakshi
Sakshi News home page

గుండె గుబిల్లు

Jul 13 2025 7:23 AM | Updated on Jul 13 2025 7:23 AM

గుండె

గుండె గుబిల్లు

●షాక్‌ కొట్టిన స్మార్ట్‌ మీటర్‌

నక్కపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్‌ మీటర్లు వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఎంత వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా వీటిని అంటగట్టింది. ఫలితంగా వేలాది రూపాయల బిల్లులు రావడాన్ని చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రాజయ్యపేట గ్రామంలో ఎరిపల్లి ముసిలి అనే వ్యక్తి నిర్మించిన షాపును ఇదే గ్రామానికి చెందిన శ్రీను అద్దెకు తీసుకున్నాడు. చిన్న బేకరీ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దుకాణాన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తుండటంతో ట్రాన్స్‌కో అధికారులు డిసెంబరులో కేటగిరి 2 కింద స్మార్ట్‌ మీటరు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో తొలిసారి రూ.37 వేల బిల్లు వచ్చింది. వందల్లో వచ్చే బిల్లు వేలల్లో రావడంతో సరిచేయమని శ్రీను స్థానిక ట్రాన్స్‌కో ఉద్యోగి తేజ ద్వారా లెటర్‌ పెట్టుకున్నాడు. మార్చి నెలలో రూ.4 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్తే ఫోన్‌ పే ద్వారా చెల్లించాడు. తదుపరి నెలలో రూ.10 వేలు, తర్వాత 20 వేలు, రూ.30 వేలు బిల్లులు వచ్చాయి. తాజాగా జూలై ఒకటో తేదీన అన్నీ కలిపి రూ.63 వేల బిల్లు చెల్లించాలని తన మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిందని శ్రీను తెలిపాడు. ట్రాన్స్‌కో మళ్లీ ఫిర్యాదు చేయగా.. మీ అభ్యర్థన అప్రూవల్‌ కాలేదని, అందుకే సమస్య పరిష్కారం కాలేదని చెప్పారని శ్రీను తెలిపాడు. తాను ఎన్ని యూనిట్లు వినియోగిస్తున్నాను, ఎంత బిల్లు వస్తోందనే వివరాలు బిల్లు రూపంలో తెలియపరచడం లేదన్నాడు. తమలాంటి పేద వారికి స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేసి వేలాది రూపాయలు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని వాపోతున్నాడు. గతంలో ఉన్న మీటరుకు నెలకు రూ. వెయ్యి నుంచి రూ.1200ల బిల్లు వచ్చేదని, ఇప్పుడు వేలల్లో వస్తోందని తెలిపాడు.

ఇదంతా కూటమి ప్రభుత్వ నిర్వాకమే .

విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా నాయకులు ఎం.కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు తదితరులు రాజయ్యపేట వెళ్లి బిల్లుల గురించి తెలుసుకున్నారు. షాపు ముందు బాధితుడితో కలసి స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచడంతోపాటు, స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. అదానీ సంస్థ షిరిడీ సాయి ఎలక్ట్రికల్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ స్మార్ట్‌మీటర్లను వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు బిగిస్తే వాటిని తొలగించి పగుల గొట్టాలని పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరక్కుండానే స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయించారని మండిపడ్డారు. సీపీఎం మండల కన్వీనరు ఎం.రాజేష్‌, కాశీరావు, బైరాగి రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

చిన్న బేకరీ షాప్‌నకు రూ.63 వేల బిల్లు

బలవంతంగా అంటకడుతున్న స్మార్ట్‌ మీటర్లు

లబోదిబోమంటున్న విద్యుత్‌ వినియోగదారులు

గుండె గుబిల్లు1
1/1

గుండె గుబిల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement