
విశాఖకు మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
డాబాగార్డెన్స్: విశాఖ మహానగరం మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికై ంది. ప్రతి సంవత్సరం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ అవార్డులను అందజేస్తుంది. ఈసారి విశాఖ మహానగరానికి ‘స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు ’దక్కింది. ఈ నెల 17న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, సుస్థిర పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రమాణాల మేరకు విశాఖ స్పెషల్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నగర పౌరులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించింది. ఈ అవార్డు పరిశుభ్రతపై అవగాహన మరింత పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. విశాఖపట్నం ఈకో–విజయ్ కార్యక్రమం ద్వారా పర్యావరణ సుస్థిరత, పరిశుభ్రతలో రాణిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిశుభ్రతలో విశాఖ అద్వితీయమైన ప్రగతి సాధించింది. 2020, 2021లో దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. 2022లో 4వ ర్యాంకుకు ఎగబాకింది. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుని టాప్–5లో నిలిచింది.