
పాడేరులో ఇగ్నో అధ్యయన కేంద్రానికి సన్నాహాలు
ఎంవీపీ కాలనీ (విశాఖ) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఇగ్నో డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు శనివారం తెలిపారు. పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.చిట్టబ్బాయి ప్రతిపాదన మేరకు త్వరలోనే కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం ఉషోదయ కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కార్యాలయంలో కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మారావు మాట్లాడుతూ ఇగ్నో ద్వారా లక్షల మంది యువత ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారన్నారు. పాడేరులో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తే గిరిజన యువతీ యువకుల ఉన్నత చదువుకు బాటలు పడతాయన్నారు. కేంద్రం ఏర్పాటుకు ప్రిన్సిపల్ చిట్టబ్బాయి ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.