
హోంమంత్రి ఇలాకాలో ఆగని ఇసుక దందా!
కోటవురట్ల: హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. కొంత కాలంగా నిశ్శబ్ధంగా ఉన్న వరాహ నది మళ్లీ ఘోషిస్తోంది. ఇసుక దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. అడ్డదారిలో అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇసుక మాఫియా మళ్లీ చేతివాటం చూపిస్తోంది. మండలంలో వరహనదిలో ఇసుక చోరీకి గురవుతోంది. వాస్తవానికి నదిలో తవ్వకాలకు సరిపడినంత ఇసుక అందుబాటులో లేదు. ఇంతకు మించి తవ్వకాలు జరిపితే భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ మోటార్లు మూలకు చేరే అవకాశం ఉంది. ఇవన్నీ పట్టని ఇసుక దొంగలు డబ్బే లక్ష్యంగా దోపిడీకి తెరదీశారు. మండలంలోని గొట్టివాడ, పందూరు, కై లాసపట్నం పరిధిలోని వరాహనదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో పందూరు ప్రాంతంలో ఇసుక వేలం నిర్వహించి మూడు నెలల పాటు ఇసుక తవ్వకాలు జరిపారు. గొట్టివాడలో ఓ టీడీపీ నేత తన పలుకుబడిని ఉపయోగించి ఏకధాటిగా నాలుగు నెలల పాటు ఇసుకను దోచేశాడు. ఈ నాలుగు నెలల్లో సుమారు రూ.కోటి సంపాదించినట్టు ఆ నోటా ఈ నోటా జిల్లా అంతా వ్యాపించింది. ఈ విషయం హోం మంత్రి చెవికి చేరడంతో చెడ్డపేరు వస్తోందని మండల స్థాయి నాయకులపై అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దాంతో కొంత కాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
వారం రోజులుగా షరామామూలు..
మళ్లీ తాజాగా వారం రోజులుగా తవ్వకాలు మొదలైనట్టు తెలుస్తోంది. మరో రూ.కోటి లక్ష్యంగా సదరు నేత రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం మళ్లీ మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నదిలోని ఇసుకను నాటు బళ్లు, ట్రాక్టర్ల ద్వారా రహస్య స్థావరాలకు తరలించి అక్కడి నుంచి లారీల ద్వారా విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు పంపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. గొట్టివాడలో మామిడి తోటలు, కొండ ప్రాంతాలలో ఇసుకను నిల్వ చేసి లారీల ద్వారా కె.వెంకటాపురం మార్గంలో తరలిస్తున్నట్టు సమాచారం. ఇసుక అక్రమ తవ్వకాలపై కూటమిలో లుకలుకలు రావడంతో అధికారులకు ఫిర్యాదు వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి నదిలో నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నట్టు సమాచారం. అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తిరిగి వాటిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. కై లాసపట్నం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కూడా ఇసుకను దోచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చీకటి పడితే చాలు ట్రాక్టర్లు, నాటు బళ్లను నదిలోకి పంపి ఇసుకను తరలించుకుపోతున్నారు. కై లాసపట్నం పరిధిలో పలు రహస్య ప్రాంతాలలో ఇసుకను నిల్వ చేసి లారీల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత భారీ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతున్న మైనింగ్ శాఖాధికారుల జాడ లేకపోవడం గమనార్హం. దీనిపై తహసీల్దారు తిరుమలబాబును వివరణ కోరగా.. ఇసుక నిల్వ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని, సిబ్బందిని పంపి ఇసుకను సీజ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. నదిలోకి ట్రాక్టర్లు, నాటు బళ్లు దిగకుండా గాడి కొట్టిస్తామన్నారు.
వరాహ నదిలో యథేచ్ఛగా తవ్వకాలు
తోటల్లో నిల్వ చేసి, అక్రమ రవాణా

హోంమంత్రి ఇలాకాలో ఆగని ఇసుక దందా!