
సంక్షేమంతో ప్రభుత్వంపై భారం
నర్సీపట్నం: ప్రజల్లో చైతన్యంతో పాటు మార్పు రాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలు వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రీకరణ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడి, అభివృద్ధి కుంటుపడి భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.10 వేలు కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇంత వ్యయం నీటి పారుదలపై చేస్తే సాగు అభివృద్ధి చెందుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కనడంపై ఎంత శ్రద్ధ చూపుతారో అంతే శ్రద్ధ వారి విద్యపై చూపాలన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 1300 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరైతే, వారిలో 348 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. వారిలో 73 మంది మాత్రమే విధుల్లో చేరారని, మరో 77 మంది ఫోన్ ఎత్తలేదన్నారు. మరో 27 మంది తమకు కంపెనీ దూరమైందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యువత ఆలోచన విధానం ఇలా ఉంటే రాష్ట్ర ఎలా బాగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాదికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రూ.2 లక్షలు చెల్లిస్తే రూ.10 లక్షలు విలువ చేసే పురుగు మందు స్ప్రే డ్రోన్లు మండలానికి రెండు చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఆర్డీవో వి.వి.రమణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రావు, కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి, జెడ్పీటీసీ సుకల రమణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన