
ఇద్దరు గంజాయి నిందితుల అరెస్ట్
అనకాపల్లిటౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి రైలు మార్గంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ఎస్‌ఐ డి.ఈశ్వరరావు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ ఎస్‌ఐ డి.ఈశ్వరరావుకు అందిన సమాచారం మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ రోడ్ జంక్షన్ వద్ద ఇద్దరూ అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి బయటపడింది. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు సీఐ చెప్పారు. ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.