
గంజాయి రవాణాపై మరింత నిఘా
● ఎస్పీ తుహిన్ సిన్హా
దేవరాపల్లి/కె.కోటపాడు: గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నిఘాను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులకు సూచించారు. దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌ను, కె.కోటపాడు మండలం ఎ.కోడూరు స్టేషన్‌ను ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు. 2025లో నమోదైన రెండు హత్య కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సీఐ పి.పైడిపునాయుడు, ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావులకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేసి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శ్రీరాంపురం వై జంక్షన్ సమీపంలోనే పోలీస్ చెక్‌పోస్టును పరిశీలించారు. నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ ఈ సందర్భంగా స్థానిక విలేకర్లకు చెప్పారు. జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సిఎస్‌ఆర్ నిధులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారంతో ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో 2500 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.