
అహీర్ రెజిమెంట్ ఏర్పాటు కోసం యాత్ర
కె.కోటపాడు : భారత సైన్యంలో అహీర్(యాదవ) రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అఖిత భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజంగలా పవిత్ర కలశ యాత్రను నిర్వహిస్తున్నట్లు మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.మహేశ్వరియాదవ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న బిహార్‌లో ప్రారంభమైన ఈ యాత్ర కె.కోటపాడు మీదుగా అనకాపల్లి వైపు శుక్రవారం సాగింది. అఖిల భారత ఉత్తరాంధ్ర జోన్ కన్వీనర్ పల్లా రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో కె.కోటపాడులో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరియాదవ్ మాట్లాడుతూ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో 120 మంది అహీర్ వీర సైనికులు పోరాటం చేసి లడక్ చుగుల్ హైర్ పీల్డును కాపాడారన్నారు. ఈ యుద్ధంలో 114 మంది అహీర్ వీరులు(యాదవ) వీర మరణం పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఆంజనేయమూర్తి యాదవ్, బొట్టా రామారావు, దూళి రంగనాయకులు యాదవ్, మునిస్వామి యాదవ్, షేశపాణియాదవ్, పల్లా రామమూర్తి పాల్గొన్నారు.