
పరిశ్రమల్లో భద్రత డొల్ల
● ఫార్మా కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ? ● ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు ● రెండు వారాల క్రితం పరవాడ ఎస్‌ఎస్ ఫార్మాలో ప్రమాదం ● మూడు రోజుల క్రితం లూపిన్ కంపెనీలో ఘటన ● గుట్టుచప్పుడు కాకుండా దాచిన యాజమాన్యం
సాక్షి, అనకాపల్లి: పరవాడ సెజ్‌లో పలు ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు కొరవడ్డాయి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరిగి కొంతమంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలు సంభవించినా అధికారుల సహకారంతో యాజమాన్యాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈనెల 8న పరవాడ జేఎన్ ఫార్మాలో ఉన్న లూపిన్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వారిలో పి.లక్ష్మణ్‌కుమార్ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం దాచిపెట్టింది.
ప్రశ్నార్థకంగా కార్మికుల భద్రత
‘పరవాడ–అచ్యుతాపురం’ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఫార్మా పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. సాహితీ, ఎసెన్షియా, జేఎన్ ఫార్మాసిటీలో సినర్జీన్, ఎస్‌ఎస్ ఫార్మా, రెండు రోజుల క్రితం లూఫిన్ ఫార్మా కంపెనీ.. ఇలా వరుస ప్రమాదాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప అధికార యంత్రాంగం పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టిన దాఖలా లేదు. అచ్యుతాపురం, పరవాడ సెజ్‌లలో 130కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పలు కంపెనీలు భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సెజ్, నాన్ సెజ్ పరిధిలో 19 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఉండగా..192 ప్రమాదకరమైన పరిశ్రమలు, 56 రెడ్ కేటగిరీ పరిశ్రమలు, 82 ఫార్మా సిటీలో ఔషధ పరిశ్రమలున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపుగా 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫార్మా కంపెనీల్లో 10కు పైగా ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 40 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మృతి చెందారు. 120 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు.
మరుసటి రోజు తెలిసింది
లూపిన్ ఫార్మా ప్రమాదం గురించి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ వివరణ కోరగా.. తమకు ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు సమాచారం వచ్చిందని చెప్పారు. పోలీసులతో కలిసి ఈ ఘటనపై ఆరా తీశామన్నారు. ప్రస్తుతం లూపిన్ ఫార్మాలో అస్వస్థతకు గురైన కార్మికుడు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
మొక్కుబడిగా తనిఖీలు
ఈ ప్రమాదాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులు ఏడాదిలో కనీసం నాలుగు పర్యాయాలు తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదు. నిపుణులైన ఉద్యోగులు అధిక ఉష్టోగ్రత కారణంగా రియాక్టర్లు పేలిపోకుండా, ఇతరత్రా అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫార్మా కంపెనీల్లో నిపుణులులేకపోవడం వల్లే తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.