
కూటమి పాలనలో బిచ్చమెత్తుకోవలసిందే..
● కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన ● తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ ● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు ● లోకేష్ డౌన్‌డౌన్ అంటూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల నిరసన
తుమ్మపాల: విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తామన్నారు.. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని తూట్లు పొడుస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం తీరుపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. తల్లి కి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఇలా అయితే తమకు భిక్షాటన తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాలలతోపాటు నారాయణ, శ్రీచైతన్య సహా పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నారా లోకేష్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉంచుకుంటున్నారని, చదువు పూర్తయిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చినా సర్టిఫికేట్లు లేక తీవ్రంగా బాధపడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ, కార్యదర్శి జి.ఫణీంద్రకుమార్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించాల్సిన రూ.6400 కోట్లు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని, జీవో నెం.77 రద్దు చేయాలని, డిగ్రీ ప్రవేశాలు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ‘చలో అమరావతి’కి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీచైతన్య, శ్రీకన్య, యలమంచిలి, తుని, పాయకరావుపేట ప్రభుత్వ ఐటీఐ, జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.