
టీడీఆర్ బాండ్లు వద్దు.. పరిహారంపై మాట మార్చొద్దు
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ బాండ్లు కట్టబెట్టవద్దని, ఇచ్చిన మాట ప్రకారం పరిహారం నగదు రూపంలో అందించాలన్న ఉద్యమం ఉధృతమైంది. ఈ డిమాండ్‌తో సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మునగపాకలో 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అనకాపల్లి జాతీయ రహదారి నుంచి అచ్యుతాపురం వరకు 14 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరిస్తామంటూ ఇచ్చిన హామీలో భాగంగా బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు మాట మార్చి టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని.. అయితే అధికారులు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. 2013 భూ సేకరణ చట్టప్రకారం మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నగదుతోపాటు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలన్నారు. 24 గంటల దీక్షలో సీపీఎం నేతలు గనిశెట్టి సత్యనారాయణ, సదాశివరావు, కర్రి అప్పారావు, కాండ్రేగుల ఆదిబాబు, దాడి శ్రీరామమూర్తి, రొంగలి రాము, ఎస్.బ్రహ్మాజీ, శంకరరావు, కన్నుంనాయుడు, సోమునాయుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దీక్ష ముగుస్తుంది. శుక్రవారం రాత్రి దీక్షాధారులు శిబిరంలోనే నిద్రించారు.
నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు రాజీ లేని పోరాటం
పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి
మునగపాకలో 24 గంటల దీక్షకు దిగిన సీపీఎం నేతలు

టీడీఆర్ బాండ్లు వద్దు.. పరిహారంపై మాట మార్చొద్దు