
మొక్కుబడిగా..
●పేరెంట్స్ మీటింగ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దితే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చూపడంతో మళ్లీ సర్కారు విద్య గాడి తప్పింది. దీనికి దృష్టాంతాలుగా ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసి నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో పలు పాఠశాలల్లోని సమస్యలను తల్లిదండ్రులు ప్రస్తావించారు..
నక్కపల్లి ఉద్ధండపురంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, అది ఇప్పుడు పనిచేయడం
లేదంటూ ఆ గ్రామ ఎంపీటీసీ బచ్చల రాజు పేరెంట్ మీటింగ్‌లో ప్రస్తావించారు.. అనకాపల్లి టౌన్‌లోని గాంధీనగరం ప్రభుత్వ ఉన్నత
పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని పేరెంట్స్ మీటింగ్‌కు హాజరైన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన
సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా రేషన్ బియ్యం వండి విద్యార్ధులకు పెడుతున్నారని, ఈ విషయం పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు రావడం వల్ల తెలిసిందని మండిపడ్డారు...
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో 1955 పాఠశాలలు, 134 జూనియర్ కళాశాలల్లో గురువారం మెగా పీటీఎం సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన ఈ మెగా సమావేశాలు మొక్కుబడిగా జరిగాయి. పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై తల్లిదండ్రులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రచారార్భాటం తప్ప ఆచరణ కొరవడింది. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. పరవాడ మండలం లంకెలపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. మునగపాక మండలం పాతిపల్లి గ్రామం ఏపీ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారి ఆర్.గోవిందరావు పాల్గొన్నారు.