
ఫ్యూజ్ పోయినా డబ్బులివ్వాల్సిందే...!
● రాత్రిపూట కరెంటు పోతే జాగరణ చేయాల్సిందే.. ● నిత్యం కరెంటు కోత...బిల్లుల పేరిట వాత ● విద్యుత్‌శాఖ తీరుపై వినియోగదారుల ధ్వజం
సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు
కోటవురట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఫ్యూజ్ పోతే వేసినందుకు ఎంత చెల్లించాలని విద్యుత్ వినియోగదారులు అధికారులను ప్రశ్నించారు. కై లాసపట్నం విద్యుత్ సబ్ స్టేషన్‌లో వినియోగదారుల సదస్సును గురువారం నిర్వహించారు. విద్యుత్ ట్రాన్స్‌కో ఎస్‌ఈ జి.ప్రసాద్ వినియోగదారుల సమస్యలపై ఆరా తీయగా వినియోగదారులు ఆగ్రహంతో అధికారులపై ప్రశ్నల దాడి చేశారు. జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది తీరు అధ్వానంగా ఉందన్నారు. దీనిపై జెడ్పీ సమావేశంలో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రోజులో కనీసం ఐదారుసార్లు అనధికారిక విద్యుత్ కోత ఉంటోందని, రైతులు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ సరఫరా ఫ్లక్సేషన్ అవుతోందని, ఇంత అధ్వానమైన విద్యుత్ సరఫరాను గత ప్రభుత్వంలో ఎపుడూ చూడలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ అధికారులు అంతులేని నిర్లక్ష్యంతో పనిచేస్తున్నారని, లోపం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రైతు తుమ్మలపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ ఫ్యూజ్ పోయినా డబ్బులు ఇవ్వందే మీ సిబ్బంది పనిచేయరని ఆరోపించారు. పొలాల్లో విద్యుత్ తీగెలు కిందికి వేలాడి రైతుల పాలిట ప్రాణసంకటంగా ఉన్నాయని, కనీస నిర్వహణ కూడా చేయడం లేదన్నారు. సమస్య ఉందని ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తరని, రాత్రి పూట కరెంట్ పోతే రాత్రంతా జాగరణ చేయాల్సిందే అన్నారు. ఈ సదస్సులో వైఎస్సార్‌సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.