
రోజూ పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారా...!
అనకాపల్లి టౌన్: గాంధీనగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించే భోజనం బాగోలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన సమయంలో గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ రేషన్ బియ్యం వండి విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయం పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు రావడం వల్ల తెలిసిందన్నారు. ప్రతి రోజూ ఇలాంటి భోజనమే పెడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కొందరు మండల విద్యాశాఖాధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన విద్యాశాఖాధికారి కోటేశ్వరావు స్వయంగా స్కూల్‌కి వెళ్లి భోజన పథకం తీరును పరిశీలించారు. భోజనం రుచి చూసి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులను పిలిచి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ గతంలో పలుమార్లు హెచ్చరించామని, తల్లిదండ్రులతో కూడిన కమిటీ తీర్మానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.