
కూటమి నేతల మద్దతుతో ప్రభుత్వ భూమి ఆక్రమణ
● కలెక్టరుకు వైఎస్సార్‌సీపీ నేత ఫిర్యాదుతో కదిలిన అధికారులు
గుమ్మడిగొండలో ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు
నాతవరం: కూటమి నేతల మద్దతుతో కొందరు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. మండలంలో గుమ్మడిగొండ పంచాయతీ సర్వే నంబరు 102/2లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత ప్రభుత్వం జగనన్న లేఅవుట్ వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నిర్ధారించారు. అందులో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయకూడదంటూ అప్పటి కూటమి నేతలు వివాదం సృష్టించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదంతో ఈ భూమిలో అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేయకుండా మరో చోట స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమిలో పలువురు మొక్కలు నాటి ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయంపై ఎంపీటీసీ సభ్యులు సుర్ల పాప, వైఎస్సార్‌సీపీ నాయకుడు సుర్ల అచ్చియ్యనాయుడు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. నాతవరం తహసీల్దార్ వేణుగోపాల్ రెండు రోజుల క్రితం ఆ భూమిని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిని పిలిచి తమ వద్ద ఏమైనా రికార్డులు ఉంటే చూపించాలన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ భూమిలో ఎటువంటి పనులు చేపట్టరాదన్నారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది అందరి సమక్షంలో గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.