
హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు
● గిరిజనులకు చాలా నష్టం ● తక్షణమే సర్వే నిలిపివేసి, అనుమతులు రద్దు చేయాలి ● పలువురు సభ్యుల డిమాండ్ ● ఉమ్మడి విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్లకార్డులతో నిరసన
మహారాణిపేట (విశాఖ): అనంతగిరి మండలం గుజ్జలి, చిట్టంవలసలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు నెలకొనడమే కాకుండా పర్యావరణం, రైతులకు నష్టం జరగనున్న దృష్ట్యా ప్రాజెక్టుల సర్వే నిలిపివేసి, అనుమతులను తక్షణమే రద్దు చేయాలని తీర్మానించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతగిరి జెడ్పీటీసీ (సీపీఎం) డి.గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చట్ట విరుద్ధమన్నారు. వీటివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గిరిజన చట్టాలను ఉల్లంఘించడంతోపాటు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన గ్రామసభలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అనకాపల్లి జిల్లా రైవాడ జలాశయం నీరు కూడా కలుషితం అవుమవుతుందని, దీనివల్ల ఇటు రైతులు అటు విశాఖ నగరానికి తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌ల వల్ల గిరిజనులకు ఎంతోనష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. దీనిపై ఏఎస్సార్ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం విరమించాలని ప్లకార్డులతో పలువురు సభ్యులు నిరసన తెలిపారు. ఉచిత విత్తనాలు అందించాలని, రైతు భరోసాకు సంబంధించి రైతుల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు తగ్గడానికి కారణాలు తెలియజేయాలని పలువురు సభ్యులు కోరారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, కోఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కలెక్టరు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చెప్పిన పనులే కాకుండా ప్రజల అవసరాలను కూడా అధికారులు పట్టించుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయకృష్ణన్ మాట్లాడుతూ స్వయంగా పనులను పర్యవేక్షించి త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
కేజీహెచ్‌లో సరిగా అందని వైద్య సేవలు
గిరిజనులకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు అందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు అందజేస్తేవిచారణ చేస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌హరేందిర ప్రసాద్ చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర సూచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సంఘ సమావేశాలు, సర్వ సభ్య సమావేశాలు వేర్వేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరగా అందుకు జెడ్పీ చైర్‌పర్సన్ అంగీకరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, కె.రాజ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు