కదంతొక్కిన కార్మికలోకం | - | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన కార్మికలోకం

Jul 10 2025 6:35 AM | Updated on Jul 10 2025 6:35 AM

కదంతొ

కదంతొక్కిన కార్మికలోకం

నర్సీపట్నం: లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఇతర సామాజిక చట్టాలు తేవాలన్న డిమాండ్‌తో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సీపట్నంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అబిడ్స్‌ జంక్షన్‌ నుంచి ఆర్డీసీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ కొనసాగింది. మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన తరువాత సంపద సృష్టికర్తలైన కార్మికులను, రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్‌, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక కుటుంబాలను వీధిన పడేస్తున్నారని ఆరోపించారు. 12 గంటల పనిదినాలను అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, బ్యాంకుల ఉద్యోగులు పని గంటల భారంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు చట్టం చేయాలన్నారు. ఆశా, మిడ్డేమీల్‌, అంగన్‌వాడీ కార్యకర్తలపై యాప్‌ల భారం పెంచుతున్నారని, సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయటం లేదని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు, స్కీమ్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదన్నారు. 104,108 యాజమాన్యాలు ఉద్యోగులకు కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ యూనియన్‌ రీజినల్‌ నాయకుడు పి.సాయికిరణ్‌, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ధనార్జన్‌, ఎల్‌ఐసీ బ్రాంచ్‌ యూనియన్‌ నాయకుడు కె.కె.వి. పడాల్‌, ఏజెంట్లు అసోసియేషన్‌ నాయకుడు వి.శ్రీరామ్మూర్తి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యు.కె.రావు, పలు సంఘాల నాయకులు వి.సామ్రాజ్యం, అరుణ, ఒమ్మి నూకరాజు, కె.రామకృష్ణ, సత్తిబాబు, శివ, కె.నానాజీ, బాబురావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, సీపీఐ నాయకులు జి.గురుబాబు, కె.లక్ష్మి, రాధాకృష్ణ, శ్రీరామ్మూర్తి, చిన్ననాయుడు, మేకా సత్యనారాయణ, శివలంక కొండలరావు, శ్రీనివాసరావు, భాస్కరరావు, భవాని తదితరులు పాల్గొన్నారు.

లేబర్‌ కోడ్స్‌ చట్టాలను రద్దు చేయాలి

అనకాపల్లి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన తీసుకు వచ్చిన లేబర్‌ కోడ్స్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం పలు కార్మిక సంఘాలు అనకాపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయం నుంచి నాలుగురోడ్ల జంక్షన్‌, ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దు చేయాలని, యథావిధిగా కార్మిక చట్టాలను కొనసాగించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు త్రినాఽథ్‌, భద్రరావు, వీరాచారి, చైతన్య, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.

చోడవరం బస్టాప్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన లక్షణ్‌ మాట్లాడుతూ ముఠా కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐటీయూసీ నాయకుడు వైఎన్‌ భద్రం మాట్లాడుతూ ఆటో కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీరామదాసు అబ్బులు,మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు బంగారు రవి, రిక్షా కార్మికుల సంఘం నాయకులు సూదికొండ మాణిక్యాల రావు తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన కార్మికలోకం 1
1/1

కదంతొక్కిన కార్మికలోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement