
అర్లిలో భూసర్వే అడ్డగింత
● సాగులో ఉన్న భూములకు పట్టాలను ఇప్పిస్తారని చెబితే విశ్వసించాం ● ఇప్పుడు భూములు తీసుకుంటామంటే ఎలా? ● ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు ● గ్రామ సభ నిర్వహించిన తరువాతే సర్వేకు అంగీకరిస్తామని తేల్చిచెప్పిన రైతులు
కె.కోటపాడు: ఎస్‌ఈజెడ్ పేరిట రెవెన్యూ అధికారులు ఆర్లి రెవెన్యూలో నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, మహిళలు అడ్డుకున్నారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియజేయాలని, భూముల వివరాలను ఎందుకు నమోదు చేస్తున్నారో చెప్పాలని వీఆర్వో, సర్వేయర్లను డిమాండ్ చేశారు. తమ భూముల వివరాలను నమోదు చేసేందుకు అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. గ్రామసభ నిర్వహించిన తరువాత సర్వే జరపాలి తప్ప, గ్రామసభ జరగకుండా ఈ విధంగా రైతుల భూముల వివరాలను నమోదు చేయడం తగదన్నారు. సాగులో ఉండి, పట్టాలు లేని రైతులకు పట్టాలు మంజూరు చేసేందుకు ఇది వరకూ ఈ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఈ భూములను సర్వే చేసి, ఎస్‌ఈజెడ్‌కు కేటాయిస్తే ఏ విధంగా తామంతా జీవనం సాగించాలని మహిళలు కాళ్ళ నాగమణి, బోళెం నారాయణమ్మ, యడ్లంకి పైడమ్మ, మునగపాక లక్ష్మి, రుత్తుల పార్వతి, దమ్ము లక్ష్మి, తాళ్ళ పార్వతి సిబ్బందిని ప్రశ్నించారు. మా భూములను లాక్కుంటే రోడ్డుపై పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన డీపట్టా భూములను తామంతా తాతముత్తాతల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నట్టు మాజీ సర్పంచ్ బోళెం కృష్ణారావు, బోళెం కాసుబాబు, రుత్తుల పాత్రుడు, కక్కల అప్పలనాయుడు తెలిపారు. ఎటువంటి సమాచారం లేకుండా బలవంతంగా సర్వేను చేపట్టి వివరాలను నమోదు చేయడం తగదన్నారు. సాగులో ఉన్న ఈ భూములపై హక్కులను వదులుకోవాలంటే మా కుటుంబాల పరిస్థితి ఏంటని రెవెన్యూ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేను అడ్డుకున్న సమాచారాన్ని సిబ్బంది రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సర్వే ప్రాంతం వద్దకు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, కె.కోటపాడు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఈ ప్రాంతంలో సర్వేను చేపడుతున్నారని, సహకరించాలని గ్రామస్తులను కోరారు. గ్రామసభ నిర్వహించకుండా సర్వే చేయడం తగదని గ్రామస్తులు పోలీసులకు తెలపడంతో గ్రామసభను నిర్వహించిన తరువాతే సర్వే చేపట్టే చర్యలను తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సీఐ పైడపునాయుడు తెలిపి వెళ్లిపోయారు.

అర్లిలో భూసర్వే అడ్డగింత