
లాయర్ల కేసుతో బీఎన్ రోడ్డు పనులు ప్రారంభం
● నాసికరంగా చేపడుతున్న పనులు ● పత్తాలేని ఆర్‌అండ్‌బీ అధికారులు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డు గోతుల పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు శిథిలమై గోతులు పడ్డ బీఎన్ రోడ్డును బాగు చేయాలని ఆందోళనలు, ధర్ణాలు చేపట్టారు. మూడు రోజుల కిందట చోడవరం కోర్టులో బీఎన్ రోడ్డు పనులు చేపట్టాలని ప్రముఖ లాయర్లు కోర్టులో ఫిటిషన్ వేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు, గుత్తేదారులకు కోర్టు అంక్షింతలు వేస్తుందన్న భయంతో ముందుగానే బీఎన్ రోడ్డులో గోతులను కప్పే పనులు చేపట్టారు. అయితే రోడ్డు గోతుల పూడ్చివేత పనులు నిబంధనలు ప్రకారం చేయడం లేదని విమర్శిస్తున్నారు. వడ్డాది, బంగారుమెట్ట, ఎల్‌బీ పురం, శింగవరం తదితర గ్రామాల వద్ద పెద్ద పెద్ద గోతుల్లో పొక్లెయిన్‌తో మట్టి వేసి గోతులను కప్పేస్తున్నారు. మట్టిపై తూతూ మంత్రంగా రాయి బుగ్గి వేసి రోడ్డు పనులు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పరివేక్షణ లేకుండా గుత్తేదార్లు చోడవరం, మాడుగుల ఫరిధిలో ఉన్న బీఎన్ రోడ్డులో పనులు చేపడుతున్నారు. దీనివల్ల ఏ మాత్రం వర్షం కురిసినా మరలా బురదలా రోడ్డు మారి గోతులు పడుతుందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా పటిష్టంగా ఆర్‌అండ్‌బీ రోడ్డులో పనులు చేపట్టాలని పలువురు ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

లాయర్ల కేసుతో బీఎన్ రోడ్డు పనులు ప్రారంభం