
పెద్దేరు నదిలో గల్లంతైన మృతదేహం లభ్యం
చోడవరం: పెద్దేరు నదిలో జన్నవరం వంతెన సమీపంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కె.కోటపాడు మండలం, చౌడువాడ గ్రామానికి చెందిన ఎస్. సన్యాసిరావు (35) చోడవరం మండలం జన్నవరం గ్రామంలో తన బంధువులు ఒకరు మృతిచెందడంతో అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చారు. పెద్దేరు నది ఒడ్డున స్మశాన వాటికలో అంత్యక్రియలు అనంతరం స్నానంచేసేందుకు పక్కనే ఉన్న పెద్దేరు నదిలో అందరితోపాటు సన్యాసిరావు కూడా దిగారు. ప్రమాదశాత్తు నదిలో మునిగిపోయి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, చోడవరం పోలీసులు ప్రమాదస్థలానికి వచ్చి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుడు సన్యాసిరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతిచెందడంతో భార్య, కుటుంబసభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.