
ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత మృతి
అచ్యుతాపురం రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన రుత్తల హేమలక్ష్మి(32) చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అచ్యుతాపురం ఎస్‌ఐ సుధాకర్‌రావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. లాలం కోడూరు గ్రామానికి చెందిన హేమలక్ష్మి, భర్త రుత్తల శ్రీను అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. భర్త వేధింపులు తాళలేక ఆమె ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అచ్యుతాపురం ఎస్‌ఐ తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.