
నిర్వాసితులకు న్యాయం చేయాలి
● ఆర్‌డీవోకు వైఎస్సార్‌సీపీ నేతల వినతి
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణను కోరారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీవోను కలిశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లయిన మహిళలు, పురుషులకు సమానంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఇంటి స్థలంతో పాటు, ఇల్లు నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. డీఫారం, ప్రభుత్వ సాగు భూముల్లో ఉన్న ఫలసాయానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలని ఆర్‌డీవోకు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే పనులు చేపట్టేందుకు సహకరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అనంతరం వీసం రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని చాలా రోజుల నుంచి నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, ఏపీఐఐసీ పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసుల సాయంతో నిర్వాసితులను బెదిరించి పనులు కొనసాగిస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ శాంతియుతంగా పోరాటం చేస్తోందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, మత్స్యకారులకు, నిర్వాసితులకు అండగా ఉద్యమిస్తామన్నారు. గతంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం పోరాటం చేసిన కూటమి నేతలు ఇప్పుడు ముఖం చాటేశారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓట్ల కోసం రాజకీయాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, సర్పంచ్‌లు భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, గోవిందు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, తళ్ల అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.