
అమర్‌నాథ్ పర్యటనతో గతుకుల రోడ్డుకు మోక్షం
రోలుగుంట: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పర్యటనతో రోలుగుంట వద్ద భీమిలి– నర్సీపట్నం రోడ్డులో ప్రమాదకర గోతులకు మోక్షం కలిగింది. ఈ రోడ్డు అభివృద్ధికి మోకాలడ్డుతూ వచ్చిన టీడీపీ నాయకులు ప్రస్తుతం అధికారంలో ఉన్నా బాగు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కొత్త చెరువు మలుపు నుంచి పీఏసీఎస్ వరకూ ఈ రోడ్డులో ప్రమాదకర గోతుల్లో వాహనదారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చేది. అదుపు తప్పి వాహనాలు బోల్తా పడితే గాయాల పాలయ్యేవారు. ఇదిలా వుంటే ఈ నెల 6న రోలుగుంటలో పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశ స్థలం వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకు ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ర్యాలీలో ఏ విధమైన ప్రమాదాలకు తావులేకుండా పీఏసీఎస్ నుంచి సమావేశం ఏర్పాటు చేసిన ఆర్సీఎం చర్చి వరకూ గోతుల పూడ్చే పనులను ఈ నెల 5, 6 తేదీల్లో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకట్రావు చేయించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తమ సొంత నిధులతో గోతులు పూడ్చటంతో వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ రావడంతో టీడీపీ నాయకులు మేల్కొని మంగళవారం మరికొన్ని గోతులు పూడ్చే పనులు చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్య మెరుగుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పర్యటన ఎంతో మేలు చేసిందని స్థానికులు, వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
● సొంత నిధులతో బాగు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

అమర్‌నాథ్ పర్యటనతో గతుకుల రోడ్డుకు మోక్షం