
మత్స్యకారుడు ఎల్లాజీ కుటుంబాన్ని ఆదుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు డిమాండ్
నక్కపల్లి: ఇటీవల పూడిమడక తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు ఎల్లాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. మంగళవారం నక్కపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతయితే తక్షణమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంత వరకు సరైన గాలింపు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఎల్లాజీ క్షేమంగా ఉన్నాడో లేడో గుర్తించాలని, ఏడేళ్ల వరకు ఎటువంటి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని చట్టం చెబుతున్నట్టు పోలీసులు అంటున్నారన్నారు. అప్పటి వరకు గల్లంతైన వ్యక్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబం ఎలా బతుకుతుందని జోగులు ప్రశ్నించారు. అవసరమైతే మత్స్యకారుల విషయంలో చట్టసవరణ చేయాలన్నారు. తోటి మత్స్కకారులతో పాటు, గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీనియర్ నాయకులు మణిరాజు, పాపారావు, ఈశ్వరరావు, నానాజీ, తదితరులు పాల్గొన్నారు.