
గ్రామసభ నిర్వహించకుండా భూసేకరణ తగదు
● సీపీఎం నాయకుడు యర్రా దేముడు
కె.కోటపాడు: గ్రామసభ తీర్మానం లేకుండా ఎస్‌ఈజెడ్‌కు భూ సేకరణకు యత్నిస్తుండడం అన్యాయమని సీపీఎం నాయకుడు, ప్రజా సంఘాల కన్వీనర్ యర్రా దేముడు తెలిపారు. మండలంలోని ఆర్లి గ్రామంలో సోమవారం రైతులను, గ్రామస్తులను ఆయన కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ఆర్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకునేందుకు యత్నిస్తుందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు రైతుల నుంచి భూమి తీసుకున్నట్లయితే ముందుగా గ్రామసభ పెట్టి అంగీకారం తీసుకోవాలన్నారు. భూములు తీసుకున్నట్లయితే అప్పటి మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అదనంగా పరిహారం రైతులకు ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయిన రైతుకు ఉపాధి, చెట్లుకు, పశుపోషణకు ఎంత పరిహారం ఇస్తారో ముందుగానే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి గ్రామసభలు లేకుండా భూసేకరణ సర్వే చేపట్టొద్దని రెవెన్యూ సిబ్బందికి తెలిపారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బోళెం కాసుబాబు, రుత్తుల పాత్రుడు, ఎస్.రమణ, కర్రి నూకరాజు, కక్కల చెంచు తదితరులు పాల్గొన్నారు.