
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
అనకాపల్లి: సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, చైర్మన్ థయామణి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 22 వేల మంది ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషన్‌లో 198 కేడర్లలో 15 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని వాపోయారు.
ఎన్నికల హామీ మేరకు మినిమం టైం స్కేలు, ఒకే కేడర్ – ఒకే వేతనం అమలు చేయాలన్నారు. సమాన సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వీటి సాధన కోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ హానరరీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఫెడరేషన్ అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.వి. శ్రీనివాసరావు, పెంటయ్య, బీఎన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
● ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, చైర్మన్ థయామణి