
చెరకు ఉత్పత్తులను వృద్ధి చేయడమే లక్ష్యం
గిరిజన రైతులకు చెరకు ఉత్పత్తి, సాగుపై శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్తలు
తుమ్మపాల: గిరిజన ప్రాంతాల్లో చెరకు ఉత్పత్తులను మరింత వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రాంతీయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ సిహెచ్.ముకుందరావు, ప్రధాన శాస్త్రవేత్త చెరకు డాక్టర్ బి.ఆదిలక్ష్మి అన్నారు. అఖిలభారత సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో చెరకు గిరిజన ఉప ప్రణాళిక కింద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 1 నుంచి 5 వరకు గిరిజన రైతులకు చెరకు సాగు విధానాల సాంకేతిక పరిజ్ఞానంపై ప్రధాన శాస్త్రవేత్త (తెగుళ్లు) డాక్టర్ వి.చంద్రశేఖర్, ప్రధాన శాస్త్రవేత్త పురుగుల విభాగం డాక్టర్ బి.భవానీ శిక్షణ నిర్వహించారు. బెల్లం తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. 25 మంది గిరిజన రైతులు వివిధ ఉన్నత శ్రేణి ప్రాంతాల రైతులు శిక్షణ పొందారన్నారు. చెరకు జ్యూస్ వేసుకునే బకెట్లు, ఎరువులు వేసుకునే పాత్రలు, చెరకు నరికే కత్తులు, వర్మి కంపోస్టు కోకోపీట్, ఎన్రిచ్డ్ మెన్యూర్ బయో ఫెర్టిలైజర్స్, కేజీ బెల్లం అచ్చులు రైతులకు పంపిణీ చేశారు.