బిల్లులు రాక.. పనులు సాగక | - | Sakshi
Sakshi News home page

బిల్లులు రాక.. పనులు సాగక

Jul 6 2025 6:47 AM | Updated on Jul 6 2025 6:47 AM

బిల్ల

బిల్లులు రాక.. పనులు సాగక

● ‘ఉపాధి’లో పెండింగ్‌ బిల్లులు రూ.132 కోట్లు ● నిధుల కోసం కాంట్రాక్టర్ల నిరీక్షణ ● పేరుకుపోయిన ‘పల్లె పండగ’ పనుల బకాయిలు ● పలు చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు ● మిగిలిన పనులు చేసేందుకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు

సాక్షి, అనకాపల్లి:

పాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌తో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగడం లేదు. కొద్ది నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తున్నా.. నిధులు రావడం లేదు. దీంతో రూ.132 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు, ఇతర పనులు చేపట్టారు. బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నా కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. చెల్లింపులు లేకపోతే ఎలా పనులు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన పనులను అసంపూర్తిగా వదిలేశారు.

నాలుగు నెలలు దాటినా..

గత ఏడాది అక్టోబర్‌ 14వ తేదీ నుంచి ‘పల్లె పండగ’ పేరిట గ్రామ సభలు నిర్వహించి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు వినతులు స్వీకరించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తయిన పనుల బిల్లులను తొలిదశలో అధికారులు అప్‌లోడ్‌ చేశారు. నాలుగు నెలలు దాటినా కాంట్రాక్లర్లకు తొలి దశ నిధులు విడుదల కాలేదు. కొన్ని చోట్ల బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే పనులు నిలిపివేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం వేసిన రాళ్లు, కంకర, ఇసుక వర్షాలకు కొట్టుకుపోయి రహదారులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి.

అసంపూర్తిగా పనులు...

ఉపాధి హామీ పథకం బిలుల్లు రాకపోవడంతో సబ్బవరం, నర్సీపట్నం, నాతవరం, రావికమతం, చోడవరం,నక్కపల్లి, కశింకోట, రోలుగుంట, గొలుగొండ, దేవరాపల్లి మండలాల్లో పల్లె పండగ పనులను కాంట్రాక్టర్లు అసంపూర్తిగా నిలిపివేశారు. కొన్ని చోట్ల మందకొడిగా సాగుతున్నాయి. పనులు పూర్తి చేయాలంటూ ఇంజినీర్లు నోటీసులు జారీ చేస్తున్నా బిల్లులు విడుదలైతేనే పనులు చేపడతామని కాంట్రాక్టర్లు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు.

గత ప్రభుత్వంలోనే మేలు..

కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ‘పల్లె పండగ’ పనులు చేయడానికి పోటీ పడ్డారు. కానీ బిల్లులు అందకపోవడంతో డీలా పడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే త్వరగా బిలుల్లు వచ్చేవని చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు.

కాగా పెండింగ్‌ బిల్లుల విషయాన్ని పీఆర్‌ ఈఈ వద్ద ప్రస్తావించగా.. రోడ్ల పనులు ఒకింత నెమ్మదిగా జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పూర్తిగా నిలిచిపోలేదన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. త్వరలో నిధులు విడుదలవతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లాలో 166 కిలోమీటర్ల పొడవున 1,354 రోడ్ల నిర్మాణ పనులకు రూ.143 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇంతవరకు రూ.11 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.132 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబరు నుంచి ‘పల్లె పండగ’ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు వంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 189 కిలోమీటర్ల పొడువుగల 1,734 రోడ్ల నిర్మాణ పనులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీపడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 166 కిలోమీటర్ల పరిధిలో 1,354 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.143 కోట్లు విడుదల చేయాలంటూ ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. మార్చి నెలాఖరునాటికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ జూలై నెల కూడా వచ్చేసింది. ఇంకా నిధులు విడుదల కాలేకపోవడంతో కాంట్రాక్టర్‌ మిగిలిన పనులు నిలిపివేశారు.

బిల్లులు రాక.. పనులు సాగక 1
1/1

బిల్లులు రాక.. పనులు సాగక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement