
అడుగడుగునా నిలదీత
● పి.ధర్మవరంలో హోంమంత్రికి ఎదురైన అనుభవం ● సుపరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి
ఎస్.రాయవరం: సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా నిలదీతలు, అసంతృప్తులు ఎదురవుతున్నాయి. ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి వంగల పూడి అనితకు ఈ అనుభవం ఎదురైంది. తమకు వృద్ధాప్య పింఛను రాలేదని, తల్లికివందనం పథకం వర్తించలేదని, గ్రామంలో వీధి రోడ్లు, కాలువలు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్రాంతి పండగ లోగా రోడ్లన్నీ బాగు చేస్తామని, కొత్తరోడ్లు వేస్తామంటూ హామీలు ఇచ్చారని, అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు, తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తామంటూ ప్రచారం చేశారని, అందరికీ మాటెలా ఉన్నా ఒక్కరికి కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందలేదని పలువురు మహిళలు వాపోయారు.గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇది తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తల్లికివందనం పథకం వర్తించని వారు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు మంత్రిని, టీడీపీ నాయకులను నిలదీసే సన్నివేశాలు, ప్రశ్నిస్తున్న అంశాలను ఫొటోలు, వీడియోలు తీయకుండా టీడీపీ నాయకులు జాగ్రత్త పడుతున్నారు.
టీడీపీలో గ్రూపుల గోల
ఇక టీడీపీకి సంబంధించి గ్రూపుల పోరుకూడా మంత్రి ముందుకు వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉంటే పార్టీకి సంబంధించిన సమాచారం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే తెలియజేయడం ఎంతవరకు సమంజసమని పలువురు కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఇలా అయితే పార్టీకి నష్టం జరుగుతుందని, అందరినీ కలుపుకొని పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తూతూ మంత్రంగా..
బుచ్చెయ్యపేట : మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. మంగళాపురం, కుముదాంపేట, విజయరామరాజుపేట, పి.భీమవరం, చిన అప్పనపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. నాయకులంతా ఫొటోలకు ఫోజులివ్వడానికే పోటీపడ్డారు.