
10న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: జిల్లాలోని 1955 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10 మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం, తల్లికి వందనం పథకం అమలుపై నియోజకవర్గ, మండల అధికారులతో ఆమె శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలకు చెంది 2.12 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో ఆయా విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలను, జూనియర్ కళాశాలలను సుందరంగా అలంకరించి, విద్యార్థులు, తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి పండగ వాతావరణంలో సమావేశం జరుపుతామని చెప్పారు. విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్నట్టు తెలిపారు. పాఠశాల ఆవరణలో గానీ, ఇంటి వద్ద గానీ మొక్క నాటవచ్చని చెప్పారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు జరిపి, వారి ఆరోగ్య స్థితిపై 10న రిపోర్ట్ ఇస్తారన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించనున్నట్టు చెప్పారు. పూర్వ విద్యార్థులు, అక్కడే చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన గొప్ప వ్యక్తులను కూడా ఆహ్వానించి, సన్మానించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా ర్థులకు, తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బాలికల రక్షణ, సైబర్ క్రైమ్, ఆరోగ్యం,డ్రగ్స్,గంజాయి నిర్మూలనపై అవ గాహ న కల్పించనున్నట్టు తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, సీపీవో జి.రామారావు, డీవీఈవో వినోద్ బాబు పాల్గొన్నారు.