
పెంచిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలి
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను, స్మార్ట్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టాలని ఇచ్చిన పిలుపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగించడంపై ఉన్న శ్రద్ధను సూపర్ సిక్స్ పథకాలు అమలు పై పెట్టాలని ఆయన తెలిపారు. అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే ఈ ఒప్పందం రద్దు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటనలు ఇచ్చి న కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు ఒప్పందం రద్దు చేయలేదో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేశ్వరి, జి.ఫణింద్ర కుమార్, అనకాపల్లి మండల కార్యదర్శి వియ్యపురాజు, జిల్లా సమితి సభ్యులు గొర్లె దేముడు బాబు, నాయకులు కోరిబిల్లి శంకరరావు, కాసుబాబు,పోతురాజు,సత్తిబాబు,త్రినాథ్,సత్యనారాయ ణ, ఎం.సూరిబాబు, ఈశ్వరరావు,బుజ్జి పాల్గొన్నారు.