
మత్స్యకారుని గల్లంతుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
పూడిమడక తీరంలో ఆందోళన చేస్తున్న
మత్స్యకార నాయకులు, బాధిత కుటుంబీకులు
అచ్యుతాపురం రూరల్:
పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి ఎర్రయ్య సముద్రంలో ప్రమాదవశాత్తు గల్లంతై మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని మత్స్యకార సంఘాల నాయకులు, కుల పెద్దలు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పూడిమడక సముద్ర తీరంలో మత్స్యకార నాయకులు, కుటుంబీకులు ఆందోళన చేశారు. మత్స్యకారులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని వారు ఆరోపించారు.
ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా రాకపోవడం అన్యాయమన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి చేపల వేట సాగించే మత్స్యకారులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికై నా గల్లంతైన మత్స్యకారుని ఆచూకీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే రాష్ట్ర మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
నావికా దళ సాయంతో గాలింపు
ఈ విషయమై ఎఫ్‌డీవో రవితేజను సాక్షి వివరణ కోరగా.. గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నావికా దళ సహాయంతో రాణీ రాష్మోని, కనకలతా బారువా అనే రెండు షిప్‌ల సాయంతో సముద్రంలో గాలించామన్నారు. శనివారం జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు రవితేజ తెలిపారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ లేని సమయంలో మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా త్రీమెన్ కమిటీ(ఆర్‌డీవో, డీఎస్‌పీ, ఏడీ ఫిసరీస్) ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని 3 నెలల వ్యవధిలో అందించనున్నట్టు ఎఫ్‌డీవో తెలిపారు. మత్స్యకారులు వేట సమయంలో లైఫ్ జాకెట్స్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.