
కూటమి పాలనలో మహిళలకు తప్పని వేధింపులు
ప్రిన్సిపాల్ అన్నపూర్ణను పరామర్శిస్తున్న యూటీఎఫ్ నాయకులు
అనకాపల్లి టౌన్: మహిళలను ఇబ్బందులకు గురిచేయడమే కూటమి ప్రభుత్వం సుపరిపాలనా? అని యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కోరెడ్ల విజయ గౌరీ ప్రశ్నించారు. చోడవరం ఎమ్మెల్యే, ఇతరుల వేధింపుల కారణంగా అస్వస్థతకు గురైన వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ అన్నపూర్ణను యూటీఎఫ్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. స్థానిక శారదా కాలనీలో నివాసముంటున్న ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయగౌరీ మాట్లాడుతూ వడ్డాది కేజీబీవీలో విద్యార్థుల చేరిక విషయంలో కూటమి నాయకుల గ్రూప్ తగాదాలు నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఇందుకు కారణమైన చోడవరం ఎమ్మెల్యే, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ నాయకుడు వి.వి.శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు జి.కె.ఆర్.స్వామి, అలివేలు, హేమలత, సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు.