
రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.
సాక్షి, అనకాపల్లి:
జిల్లాలో నర్సీపట్నం నుంచి రోలుగుంట, కొత్తకోట, రావికమతం, కోమళ్లపూడి, వడ్డాది, చోడవరం, వెంకన్నపాలెం మీదుగా గంధవరం వరకు సుమారు 48 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు ప్రమాదభరితంగా ఉంది. అడుగుకో గొయ్యి ఏర్పడి.. వర్షపు నీటితో నిండిపోయి ఏది రోడ్డో, ఏది గుంతో తెలియక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా వర్షాలు కురవడంతో ఆ గుంతలు కాస్త పెద్ద పెద్ద నూతులుగా మారాయి. రాత్రి సమయంలో ఆ రోడ్డుపై వాహనదారులు వెళ్లాలంటేనే భయపడతున్నారు. అడుగడుగునా నరకయాతన పడుతున్నారు. ఓ మాదిరి వర్షం పడిందంటే చాలు ఆ గోతుల్లో నీళ్లు చేరి రోడ్డంతా జలమయం అవుతుంది. అదేవిధంగా మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి కూడా అదే మాదిరి మారింది. దేవరాపల్లి నుంచి గిరిజన పంచాయతీ వాలాబు వెళ్లే రోడ్డుపై సుమారు 10 కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు పూర్తిగా శిథిలమవ్వడంతో సుమారు 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాల రహదారి
గంధవరం నుంచి వెంకన్నపాలెం, చోడవరం, విజయరామరాజుపేట, వడ్డాది, కోమళ్లపూడి, రావికమతం, కొత్తకోట, రోలుగుంట వరకు 48 కిలోమీటర్ల మేర ప్రయాణించే వారు నరకం చూస్తున్నారు. 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్‌తో (60:40) ఈ రోడ్డుకు రూ.112 కోట్లు మంజూరు చేశారు. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్‌కు కాంట్రాక్ట్ అప్పగించారు. రోడ్డుకు ఇరుపక్కల ఏడు అడుగుల మేర విస్తరించి కొత్త రోడ్డు నిర్మాణం చేయాలి. ఈ రోడ్డులో వడ్డాది, విజయరామరాజుపేట, గోవాడ వద్ద మూడు వంతెనలున్నాయి. ఇవి కూడా వేయలేదు. రోడ్డుకు ఇరువైపుల తవ్వేయడంతో వాహనదారులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు రూ.3 కోట్లతో కోమలపూడి నుంచి బంగారుమెట్ట వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల విస్తరణ పనులు చేశారు. కాంట్రాక్టర్ మిగతా 44 కిలోమీటర్లు రోడ్డు వేయకుండా వదిలేశాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ఈ రోడ్డులో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన సొంత నిధులు రూ.1.60 కోట్లతో సుమారు ఒక కిలోమీటర్ మేర సీసీ, బీటీ రోడ్లను వేయించారు. చోడవరం టౌన్ ప్రారంభంలో బల్క్‌మిల్క్ సెంటర్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు ఏడు అడుగులు విస్తరించి, రోడ్డు నిర్మాణం చేశారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలానే ఉంది. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి మృత్యుకుహరాలుగా మారాయి. ఈ గోతుల్లో 30 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. 40 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. రావికమతం నుంచి కొత్తపేట, బుచ్చెయ్యపేట మార్గంలో చిన్నపాటి ప్యాచ్ వర్క్ మినహా కూటమి ప్రభుత్వంలో చేసిందేమీ లేదు.
దొండపూడి శివాలయం ఎదురుగా నూతిని తలపిస్తున్న గొయ్యి
అధ్వానంగా దేవరాపల్లి–వాలాబు రోడ్డు
దేవరాపల్లి నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డులో అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు పూర్తిగా శిథిలమవ్వడంతో 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి ఒళ్లు హూనమవ్వడంతోపాటు వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. వాలాబు పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి మెటీరియల్స్‌ను అధిక లోడుతో ఈ రోడ్డు మీదుగా తీసుకెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
జీవనోపాధి కోసం తప్పలేదు..
వర్షం పడినప్పుడు ఈ రోడ్డులో ప్రయాణించాలంటే భయంగా ఉంది. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియడం లేదు. మాకు అలవాటైన రోడ్డు కావడంతో నెమ్మదిగా వెళుతున్నాం. ఈ రోడ్డులో బేరం కడితే మాకు వచ్చే డబ్బుల కన్నా ఆటో మరమ్మతులకే ఎక్కువవుతున్నాయి. జీవనోపాధి కోసం తప్పడం లేదు.
– మడ్డు కృష్ణ, ఆటో డ్రైవర్, కె.నాయుడుపాలెం
రోడ్లు కాదు చెరువులే..
రోలుగుంట–గంధవరం బీఎన్ రోడ్డులో ప్రయాణం చేయాలంటేనే భయంగా ఉంది. ఈ రోడ్డు వేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు. కార్ల ఇంజిన్లు గుంతల్లో ఇరుక్కుపోతున్నాయి. గుంతల్లో నీరు చేరడంతో బైక్ మీద వెళ్లాలంటే చాలా భయంగా ఉంది. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
– పద్మనాభుని తాతాజీ, మెడికల్ స్టోర్ యజమాని, రోలుగుంట
●
నూతులు కాదు..
గోతులే..
మృత్యుకుహరాలుగా మారిన రహదారులు
దయనీయంగా నర్సీపట్నం– చోడవరం రోడ్డు
సుమారు 48 కి.మీ మేర లెక్కలేనన్ని గుంతలు
ఇదే రహదారిలో 30కి పైగా రోడ్డు ప్రమాదాలు
వర్షపు నీరు గుంతల్లో చేరి ప్రమాదకర పరిస్థితి
సంక్రాంతికి గోతులు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటన
ఐదు నెలలు దాటినా అదే దుస్థితి

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.

రహదారుల రూపురేఖలు మార్చేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు.