
చెరువును ప్రైవేటు భూమిగా మార్చేశారు..
నిన్నటి వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న చెరువును.. నేడు రూ.20 కోట్ల విలువ చేసే ప్రైవేటు భూమిగా మార్చేస్తూ జిల్లా అధికారుల ఆదేశాలతో 22ఏ నుంచి తొలగించేసిన రెవెన్యూ అధికారులు తీరుపై నిరసనగా యలమంచిలి మన్సిపాలిటీ పరిధిలోని పెదపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల యువకులు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ యర్రవరం రెవెన్యూ పరిధిలో చెరువుగా ఉన్న సర్వే నం.286లో 12.49 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం 3.27 ఎకరాలను సర్వే నం.286–2బీగా సబ్ డివిజన్ చేసి ప్రైవేటు వ్యక్తుల పేరున రాసిచ్చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు భూమిని తనకు కేటాయిస్తూ కలెక్టర్ ప్రొసిడింగ్స్ ఇచ్చారంటూ అప్పలరాజు అనే వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, చెరువును కాపాడాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణలను ప్రోత్సహించడంపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసిడింగ్స్‌ను పునః పరిశీలించాలని, 22ఏ తొలగింపు ప్రొసిడింగ్స్‌ను రద్దు చేయాలని కోరారు.